Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 54

Sabala takes on Viswamitra's Forces!!

|| om tat sat ||

కామధేనుం వశిష్ఠో అపి యదా న త్యజతే మునిః|
తదాస్య శబలాం రామ విశ్వామిత్రో అన్వకర్షత ||

తా|| ఓ రామా ! వసిష్ఠ ముని ఎప్పుడు కామధేనువు ఇవ్వలేదో అప్పుడు ఆశబలను విశ్వామిత్రుడు బలవంతముగా తీసుకొనసాగెను.

బాలకాండ
ఏబది నాల్గవ సర్గము.

శతానందుడు విశ్వామిత్రుని కథ చెప్పసాగెను:

'ఓ రామా ! వసిష్ఠ ముని ఎప్పుడు కామధేనువు ఇవ్వలేదో అప్పుడు ఆశబలను విశ్వామిత్రుడు బలవంతముగా తీసుకొనసాగెను. ఆశబలను ఆ మహాత్ముడగు విశ్వామిత్రుడు తీసుకుపోవుచుండగా శోకములో నున్న దుఃఖముతో రోదించుచున్న దై ఇట్లు ఆలోచించ సాగెను. "నేను ఆ మహాత్ముడైన వసిష్ఠునిచే పరిత్యజించబడితినా ఏమి? రాజ భటులచే తీసుకు పోబడుతున్న నేను నే దీనురాలను దుఃఖములో నున్న దానను. నే ను చేసిన దోషమేమి ? నేను ఆమహర్షియొక్క భావితాత్మను. అపారమైన భక్తిగల నన్ను ఆ ధార్మికుడు ఇష్టముగా వదలుచున్నాడా ?"

ఆశబల ఈవిధముగా అలోచించుచూ మరల మరల నిట్టూర్పులు విడిచెను. అప్పుడు వందలకొలదీ వున్న శత్రువులను వదల్చుకొని వాయువేగముతో మహాత్ముడైన వసిష్ఠుని యొక్క పాదములపై బడెను.

ఆ శబల వసిష్ఠుని ముందర నిలిచి విలపించుచూ మేఘదుందుభి వంటి స్వరముతో ఇట్లు పలికెను.
"భగవన్ ! ఈ రాజభటులు నన్ను నీ దగ్గరనుంచి తీసుకుపోవుచున్నారు . ఓ బ్రహ్మసుతా నన్ను పరిత్యజింతివా ?" ఈ విథముగా చెప్పబడగా శోకముతో నిండిన హృదయముకలవాడై, శబలతో దుఃఖములో నున్న తన సహోదరివలె ఇట్లనెను.

"ఓ శబలా ! నిన్ను త్యజించుటలేదు. నీవు చేసిన దోషము ఏమీ లేదు. ఈ బలముతో మదము ఎక్కిన మహాబలుడు అయిన రాజు నిన్ను తీసుకు పోవుచున్నాడు . అయన తో సమానమైన బలము నాదగ్గర లేదు. విశేషముగా ఆ రాజు బలవంతుడు క్షత్రియుడు పృథివీపతి కూడా|| ఏనుగులతో రథములతో కూడిన పూర్తి అక్షౌహిణీ సైన్యముతో అతడు బలవత్తరుడు".

'వశిష్ఠునిచే ఇట్లు చెప్పబడిన ఆ శబల స వినయముతో వచనజ్ఞుడైన అత్యంత ప్రభలతో వెలుగొందుచున్న ఆ బ్రహ్మర్షి తో ఇట్లు పలికెను'. "ఓ బ్రహ్మన్ ! క్షత్రియుని బలము బలమే కాదు.బ్రహ్మ జ్ఞానముకలవాడు బలవత్తరుడు.ఓ బ్రహ్మన్ ! క్షత్రియబలముకన్నా దివ్యమైన బ్రహ్మణబలమే బలవత్తరము. నీ బలము సాటిలేనిది. నీ తేజము దురాసదము. విశ్వామిత్రుడు మహావీరుడు.నీ కనా బలవంతుడు కాడు. ఓ మహాభాగా ! నీ బ్రహ్మ బలముతో పరిపుష్టి అయిన నన్ను నియోగించుము. ఆ దురాత్మునియొక్క బలదర్పమును నాశన మొనర్చెదను".

’'ఓ రామా ! ఈవిధముగా చెప్పబడిన ఆ మహా యశస్సు గల వసిష్ఠుడు ఇట్లు పలికెను. "శత్రు బలములను జయించు బలము సృజింపును" అని'.

'అయనయొక్క ఆ మాటలను విని ఆ సురభి అప్పుడు సైన్యములను సృజించెను. ఆమెయొక్క హుంకారమునుంచి వందలకొలది సృష్ఠించబడిన రాజులు విశ్వామిత్రుడు చూచుచుండగనే ఆయన సైన్యములన్నీ నాశనము చేయసాగిరి'’.

'అలా భగ్నము అగుతున్న సైన్యములను చూచి విశ్వా మిత్రుడు రథము ఎక్కిపరమక్రోధముతో ఎర్రగానున్న కన్నులతో అనేక శస్త్రములతో పప్లవసైన్యములను నాశనము చేయసాగెను.
విశ్వామిత్రునిచే వందలకొలదీ పప్లవౌలు హతమగుట చూచి అప్పుడు ( శబల) కోపముతో శకులను యవనులను మరల సృష్టించెను’'.

'ఆశకులు యవనులతో భూమి పూర్తిగా నిండిపోయెను.వారు ప్రతిభావంతులు .మహావీరులు. పొడవైన కత్తులను ధరించిఉండిరి. బంగారు వన్నెగల వస్త్రములను ధరించిఉండిరి. ఆట్టి ఆందరూ ఆ బలములన్నిటినీ మహాగ్నిజ్వాలలవలె భస్మమొనర్చిరి'.

'అప్పుడు మహాతేజోవంతుడైన విశ్వామిత్రుడు అశ్త్రములను ప్రయోగించగా యవనులు కాంభోజులు పప్లవులు చెల్లచదురు అయితిరి'.

ఈ విథముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో బాలకాండలో ఏబది నాల్గవ సర్గము సమాప్తము|

|| ఓమ్ తత్ సత్||

తతో అస్త్రాణి మహాతేజా విశ్వామిత్రో ముమోచ హ |
తై స్తైర్యవనకాంభోజాః పప్లవాశ్చాకులీ కృతాః ||

తా|| అప్పుడు మహాతేజోవంతుడైన విశ్వామిత్రుడు అశ్త్రములను ప్రయోగించగా యవనులు కాంభోజులు పప్లవులు చెల్లచదురు అయితిరి.

|| ఓమ్ తత్ సత్ ||

|| om tat sat ||